వృత్తిని వ్యాపారంగా మార్చారు – తప్పిదం ఫార్మసిస్టులదే

వైద్య ఆరోగ్య రంగాన్ని వ్యాపార రంగంగా మార్చిన కారకులు బాడుగలకు అమ్ముడు పోయిన ఫార్మసిస్టులే.

ఫార్మసీ అనేది ఒక వైద్య ఆరోగ్య రంగ వృత్తి. మెడిసిన్, లా, చార్టెడ్ అకౌంటెన్సీ మాదిరిగా ఫార్మసీ కూడా ప్రాక్టీస్ చేయదగిన వృత్తి. 1948లో ఫార్మసీ చట్టం భారత పార్లమెంటు ద్వారా ఈ దేశంలోకి తీసుకువచ్చి, కేంద్ర స్థాయిలో ఫార్మసీ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి, ఫార్మసీ విద్యను రెగ్యులేట్ చేస్తూ, వివిధ కాల పరిమితి కలిగిన వివిధ రకాల ఫార్మసీ కోర్సులను ప్రవేశపెట్టి, కోర్సులను విద్యార్థులకు అందించడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఫార్మసీ కళాశాలలకు అనుమతులు ఇచ్చి, క్వాలిఫైడ్ ఫార్మసిస్టులను ఈ సమాజానికి అందించి, ఇదే ఫార్మసీ చట్టం 1948 లోని సెక్షన్ 19 కింద ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఫార్మసీ విద్యను చదివి పట్టభద్రులై ఇక్కడ రిజిస్ట్రేషన్ లు చేసుకొని ఆయా రాష్ట్రాలలో ఫార్మసీ వృత్తిని ప్రాక్టీసు చేస్తారు. ఫార్మసీ ప్రాక్టీసును రెగ్యులేట్ చేయటానికి ఫార్మసీ చట్టం 1948 లోని సెక్షన్ 26 ఏ కింద క్షేత్రస్థాయిలో ఫార్మసీ ఇన్స్పెక్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ఫార్మసీ ఇన్స్పెక్టర్లు ప్రతి రోజు కొన్ని మందుల షాపులను సందర్శించి ఫార్మసిస్టులు తమ విధులకు హాజరయ్యి ప్రజలకు మందులు జారీ చేస్తున్నారా లేదా, విధులకు గైర్హాజరై నాన్ క్వాలిఫైడ్ వారితో మందులు జారీ చేయిస్తున్నారా అని పరిశీలిస్తారు. వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడే ఫార్మసిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ మందుల షాపుల యజమానులకు కొమ్ము కాస్తూ, కాసుల కోసం కక్కుర్తి పడి ఫార్మసీ సర్టిఫికెట్లు బాడుగళ్ళకు ఇచ్చి ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ, మరోవైపు వృత్తికి ద్రోహం చేస్తున్న ఫార్మసిస్టులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో నిరోధక అధికారులు ఫార్మసీ ఇన్స్పెక్టర్లు లేరంటే అసలు నిరోధక వ్యవస్థ లేదంటే సిగ్గుచేటు.

ఫార్మసీ వృత్తి ఒక ప్రాక్టీస్ ప్రొఫెషన్ అని 2015లో కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ ప్రవేశపెట్టిన కూడా ఈ రెగ్యులేషన్స్ ఎక్కడ అమలు జరగడం లేదు. కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ కేవలం చట్టాలు చేయడానికి వాటిని అమెండ్ చేయడానికి పరిమితమైంది. కానీ ఈ నిబంధనలను అమలు చేయాల్సింది రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్. కానీ ఏ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో కూడా సెక్షన్ 26 ఏ కింద ఫార్మసీ ఇన్స్పెక్టర్ల నియామకం జరగలేదు. ఇక అమ్ముడుపోతున్న ఫార్మసిస్టుల భరతం పట్టేది ఎవరు. ? ఫార్మసీ సర్టిఫికెట్లను బాడుగలకు ఇచ్చే విధానాన్ని అరికట్టేది ఎవరు. ? ఫార్మసీ వృత్తి బాగుపడేది ఎప్పుడు ? ఫార్మసీ కోర్సులు చదివే వారి జీవితాలు బాగుండేది ఎప్పుడు ?

ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మందుల షాపుల యజమానులకు బడుగులకు ఇచ్చి మరోవైపు అకాడమిక్ మరియు ఇండస్ట్రియల్ సెక్టార్లలో ఇదే ఫార్మసిస్టులే ఉద్యోగాలు పొంది రెండు చోట్ల పనిచేయటం వల్ల కొత్తగా ఫార్మసీ విద్యను పూర్తి చేసుకుని బయటికి వస్తున్న ఫార్మసీ పట్టబదులకు ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయి.

వైద్య ఆరోగ్య రంగంలో ఎంతో గౌరవప్రదమైనటువంటి వృత్తిలలో ఒకటైనటువంటి ఫార్మసీ వృత్తిని బ్రష్టు పట్టించింది ఆ ఫార్మసీ వృత్తిని ఆచరించి, వృత్తి ఔన్నత్యాన్ని కాపాడాల్సిన ఫార్మసిస్టులే… తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి. బాడుగలకు అమ్ముడుపోతున్న ఫార్మసిస్టులపై కేంద్ర రాష్ట్ర ఫార్మసీ కౌన్సిలర్ కు ఫిర్యాదు చేయడానికి నిరుద్యోగ ఫార్మసిస్టులు మరియు ఫార్మసీ విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఏపీ ఫార్మా జెఎసి ఆధ్వర్యంలో బాడుగలకు అమ్మడు పోయిన ఫార్మసిస్టులపై ఫిర్యాదు చేయడానికి ఒక నిర్దిష్ట ఫిర్యాదు పత్రమును విడుదల చేయడం జరిగింది.

ఫార్మసీ వృత్తి ఔన్నత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఫార్మసీ విద్యార్థి పైన ఉన్నది. ఫార్మసీ రంగంలో నిరుద్యోగానికి కారకులైనటువంటి ఫార్మసిస్టులపై కదం తోక్కాల్సిన బాధ్యత ప్రతి నిరుద్యోగ ఫార్మసిస్టుపై ఉన్నది.

ప్రాక్టీసు చేయాల్సిన వృత్తిని వ్యాపార వృత్తిగా తయారుచేసిన దుర్మార్గుల భరతం పట్టక తప్పదు. వీరు తమ ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ఇతరులకు బాడుగలకు ఇవ్వబట్టే ఈ వైద్య ఆరోగ్య వృత్తి వ్యాపార వృత్తిగా మారిపోయింది.

ప్రతి నిరుద్యోగ ఫార్మసిస్టు మరియు ప్రతి ఫార్మసీ విద్యార్థి ఫార్మసీ వృత్తి పట్ల బాధ్యత తీసుకోవాలి. ఏపీ ఫార్మా జేఏసీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రిటైల్ మందుల షాపుల వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏ మెడికల్ షాపులో ఏ ఫార్మసిస్టు విధులు నిర్వర్తించాలో ఫార్మసిస్టుల వివరాలతో సహా మందుల షాపుల వివరాలను అందిస్తోంది. ప్రతి మెడికల్ షాపుకు వెళ్లి అక్కడ విధులు నిర్వర్తించాల్సిన ఫార్మసిస్టు ఉన్నాడో లేదో వెరిఫై చేసి లేనిపక్షంలో ఏపీ ఫార్మా జేఏసీ అందుబాటులోకి తీసుకువచ్చిన ఫిర్యాదు పత్రాన్ని నింపే సదరు రాష్ట్ర మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ రిజిస్త్రారు వారికి ఈమెయిల్ ద్వారా పంపించవలసి ఉన్నది. ఇలా ఫిర్యాదులు అందిన వెంటనే ఫార్మసీ కౌన్సిల్ విచారణ చేపట్టి వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్న ఫార్మసిస్ట్ల రిజిస్ట్రేషన్ లను క్యాన్సిల్ చేయడం వల్ల ఇతర ఫార్మసిస్టులు తమ సర్టిఫికెట్లను బాడుగలకు ఇవ్వాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా మందుల షాపుల యజమానులు తమ మందుల షాపులను కొనసాగించుకునేందుకు ఫార్మసిస్టులను తమ మందుల షాపులలో నిర్దిష్ట జీతాల ఇచ్చి నియామకం చేసుకుంటారు. వైద్య ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టులకు డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల ఫార్మసిస్టులు బాగుపడతారు ఫార్మసీ కళాశాలలు కూడా అడ్మిషన్లతో కలకలలాడతాయి. ప్రజలు కూడా నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలు పొందుతారు.

కాబట్టి ప్రతి నిరుద్యోగ ఫార్మసిస్టు మరియు ఫార్మసీ విద్యార్థి మరియు ఇతర ఫార్మసీ రంగ నిపుణులు ఫార్మసీ వృత్తి పట్ల బాధ్యత వహించి బాడుగలకు అమ్ముడుపోతున్న ఫార్మసిస్టులపై మూకుమ్మడిగా ఫిర్యాదులు చేయవలసిందిగా ఏపీ ఫార్మ జేఏసీ పిలుపునిస్తోంది.

వ్యాపార రంగంగా మారిన ఫార్మసీ వృత్తిని తిరిగి మళ్ళీ ఆరోగ్య రంగా మార్చే బాధ్యత ప్రతి ఫార్మసిస్ట్ చేతుల్లో ఉంది.

Leave a Comment